ఏరులై పారుతున్న మద్యం

జి. సక్రు



మన రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కానీ మద్యం దొరకని గ్రామాలు మన కంటికి కనపడవు. ఎండాకాలం వస్తే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు త్రాగునీరు కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నేడు మనకు కన్పిస్తుంది. ముందస్తు చర్యలు చేపట్టడం కాని, ప్రజలకు కావల్సిన కనీస అవసరాలను కాని ముందస్తుగా గుర్తించి పరిష్కరించింది లేదు. కాని సర్కారు మందు బాబుల పరిస్థితిని మాత్రం ముందుగా గుర్తించడం జరుగుతుంది. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి కన్నా, వినియోగం అధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి సరుకు దిగుమతి చేసుకొని లోటు పూడ్చాల్సి వస్తుందని ముందుగానే ఆలోచించి, రాబోయే రోజులు పండుగలు వస్తున్నాయి. మద్యం వినియోగం బాగా ఉంటుందని భావించి ముందస్తు గానే రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ఉత్పత్తి పెంచాల్సిందేనని నిర్ధారణకు వస్తుంది. మద్యం పెంచాలనే దురుద్దేశ్యం ప్రభుత్వానికి ఏర్పడింది. ఊరూరా బెల్టుషాపుల జాతర పెట్టి మందును అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను తీయడానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుంది. గ్రామాల్లో బెల్టు షాపుల వల్ల మహిళల మెడలో పుస్తెలు తెగుతున్న ఘటనలుమనం చూస్తూనే వున్నాము. ఊరూరా బెల్టు షాపులు, రెస్టారెంట్లు, పబ్బులు ఏర్పాటు చేసి యువతకు మద్యం మత్తు నింపి వారి ఆలోచనలను నిర్వీర్యం చేస్తుంది. డ్రగ్స్ కు బానిసలు చేస్తుంది. యువతను తప్పుదోవ పట్టిస్తున్నది. మత్తు పానియాల వ్యాపారం చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మద్యానికి బానిసలై కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడి అనాథలయ్యారు. భర్త మద్యానికి బానిసై అర్థాంతరంగా మరణిస్తే బిడ్డల పోషణ కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న 30 సం||రాల లోపు మహిళలు ఈ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. మద్యం మహమ్మారి కాటుకు బలైన ఏ కుటుంబాన్ని పలకరించినా వారి కన్నీటి గాథలు చెబుతారు. పేద ప్రజల రక్తాన్ని పీల్చి, వచ్చే ఆదాయంతో ఎ.సి. గదులలో మన పాలకులు కులుకుతున్నారు.


మందు బాబులకు కొత్త కిక్కు రుచి చూపిస్తున్న కేసీఆర్ సర్కార్ నవంబర్ నెలలో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కొత్త అమ్మకాలను ప్రభుత్వం అనుమతిచ్చింది. గురువారం అర్థరాత్రితో పాత మద్యం ఒప్పందాలు ముగిసిపోయాయి. కొత్త వాటికి శ్రీకారం చుడుతున్నారు. 2019 నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు రెండు సంవత్సరాలపాటు నూతన ఒప్పందం అమలులోకి తెచ్చింది.


ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా టెండర్ దరఖాస్తుల విలువను అమాంతంగా రెట్టింపు చేసింది. రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2017వ సంవత్సరంలో ఈ షాపులకు టెండర్లు వేస్తే 41 వేలకు పైగా ధరఖాస్తులు వచ్చాయి. కానీ 2019లో 44 వేల ధరఖాసులు వచ్చాయి. మెదక్ జిల్లాకు సంబంధించిన సురాజ్ అనే లిక్కర్ డాన్ ఒక్కడే బినామి పేర్లతో 44 ధరఖాస్తులు అది కూడా 3 షాపులకు వేశాడంటే, మద్యం అదాయం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో టెండర్ దరఖాస్తు విలువ లక్ష రూపాయలు మాత్రమే వుంది. కాని మద్యంకు ఉన్నటువంటి డిమాండ్, వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఏకంగా టెండర్ దరఖాస్తుల విలువను రెట్టింపు 2 లక్షలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి 880 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వ్యాపార దృష్ట్యా ఆలోచిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో అనేక మార్పులను చేసింది. దుకాణాలకు ఉన్నటువంటి రెంటలను కూడా ఏడాదికి ఐదు లక్షల రూపాయల చొప్పున రెండు సం||రాలకు పది లక్షలకు పెంచింది. ఎక్సైజ్ ట్యాక్స్ కింద అదనంగా మరో ఐదు లక్షల రూపాయలను వసూలు చేస్తూ యథేచ్చగా మద్యం షాపులకు అనుమతులిస్తున్నారు. ఎజెన్సీ ప్రాంతాలలో పెసా చట్టానికి తూట్లు పొడుస్తూ అనుమతులిస్తున్నారు.


పెసా చట్టం అంటే ఏమిటి


భారత పార్లమెంటు 1996లో ఈ చట్టాన్ని చేసింది. ఈ పంచాయితీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్స్ ఏరియా (పి.ఈ.ఎస్.ఎ.) అని దీని అర్థం. దేశంలో 10 రాష్ట్రాలను ఇందుకు ఎంపిక చేశారు. గిరిజనులకు వారి ప్రదేశాలలో వారికి స్వయం పాలన హక్కులు వీటితోపాటు స్థానిక వనరుల ఆధారంగా వారి ఆర్థిక ఎదుగుదలకు రాజ్యాంగ వెసులుబాటు కల్పించడం అనే పదాన్ని ఇందులో పొందుపరిచి చట్టం లక్ష్యాల్ని రాజ్యాంగ నిర్మాతలు క్లుప్తంగా వివరించారు. ఈ చట్టం అమలు కోసం దేశ వ్యాప్తంగా మొత్తం 25,393 గిరిజన గ్రామ పంచాయితీలను ఎంపిక చేశారు. రాజ్యాంగంలోని 5, 6 అధికరణల ప్రాతిపదికన రూపొందించిన ఈ ట్రైబల్ వెల్ఫేర్‌లో ఉమ్మడి జిల్లాలోని కొంత వరకు పంచాయితీలు భాగం పంచుకుంటాయి. ఇలా పెసా నోటిఫైడ్ పంచాయితీల్లో ఆయా పంచాయితీల పాలక మండళ్లు ఎగ్జిక్యూటివ్ కమిటీలుగా ఉంటాయి. వీరు కాకుండా గిరిజన పెద్దలు కూడా ఈ కమిటీలో సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తారు. మొత్తం సభ్యుల్లో 1/5 కోరంగా తీసుకుంటారు. మహిళలకు ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇందులో 1/3ని జనరల్ కోరం అవుతుంది. ఈ రెండింటితోపాటుగా ఆయా గిరిజన ప్రాంతాల్లోని శాంతి భద్రతల రక్షణ, గిరిజన జాతుల్లోని సహజ న్యాయ సూత్రాల అజమాయిషికి సానిక వనరుల ఆధారంగా ఉపాధి మార్గాల అన్వేషణ (రిసోర్స్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్)కు, బయటి వ్యక్తుల అక్రమ ఆర్థిక లావాదేవీల నుంచి గిరిజనులను కాపాడేందుకు (డెబిట్ కంట్రోల్), ప్రత్యేక స్టాండింగ్ కమిటీలు విధిగా ఏర్పాటు కావాల్సి వుంటుంది. ఇందులో మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇటాక్సికేషన్ కంట్రోల్ అంటే మాదక ద్రవ్యాలు లేదా ఏవేని మత్తు పదార్థాల వినిమయం, విక్రయాల విషయంలో పెసా చట్టం ద్వారా ఏర్పడబోవు. ఈ గిరిజన గ్రామ కమిటీలు చాలా కఠినంగా ఉండాలని శాసనకర్తలు నిర్దేశించారు. అందువల్లనే ఈసారి షెడ్యూల్ ఏరియాలో అధికారికి మద్యం దుకాణాలను కూడా రద్దు చేశారు అని చెప్పారు. మరి అనధికారికంగా షెడ్యూల్ ఏరియాలో ఇప్పుడు పెసా చట్టానికి విరుద్ధంగా వెలిసిన మద్యం షాపులు, బెల్టు షాపులు ఏ విధంగా ప్రభుత్వాలు అనుమతించిందో అటు మద్యం వ్యాపారులు, ఇటు అబ్కారి వారు సమాధానం చెప్పాలి. ఎజెన్సీ పల్లెలనే కేంద్రంగా చేసుకొని కొంత మంది వ్యాపారస్తులు గిరిజనుల చేతనే టెండర్లు వేస్తూ వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కత్తి మద్యం తయారు చేస్తు దొరికి పోతున్న తరుణంలో ఆ ప్రాంత ప్రజల ముందు వారినే దోషులుగా చేస్తు పబ్బం గడుపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మన నాయకులు మద్యాన్ని నిషేదిస్తామని గొప్పలు చెప్పుకుంటూ, తీరా గద్దెనెక్కినంక మద్యపాన నిషేధం ఊసేత్త కుండా మద్యంతోనే ప్రభుత్వాలు నడిపిస్తున్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నారు. నేరాల గణాంకాలు ప్రకటిస్తున్న ప్రతి సంవత్సరం ఈ నేరాలకు ప్రధాన కారణం మద్యమేనని పోలీసులు చెపుతున్నారు. మద్యం మైకంలో ఏమి చేస్తారో కూడా తెలియడం లేదు. ఇలాంటి మద్యంను ప్రభుత్వమే ప్రోత్సహించడం దుర్మార్గం. పాలక వర్గాల స్వభావాన్ని ఈ దేశ యువత అర్థం చేసుకొని మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, మద్యపాన నిషేదం కోసం అందరం ఉద్యమించాలి. ఆ ఉద్యమంలో యువత యువకులు చురుకుగా పాల్గొనాలి. పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.


- పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు